తండ్రి హిరణ్యకశిపుడు కే, గురువై పాఠాలు చెప్పిన పసివాడు ప్రహ్లాదుడు - 14 పద్యాలు అర్ధము పుణ్యము - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,658; 104 తత్వాలు (Tatvaalu) and views 224,975.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

పెద్దలు అంటే వయస్సును బట్టి కాదు, జ్ఞానాన్ని బట్టి అని, అదీ ఆత్మ జ్ఞానం, దైవ జ్ఞానం. అది నిరూపించింది, ప్రహ్లాదుడు. నారదుడు తల్లి లీలావతితి విష్ణు భక్తి మాటలు నేర్పిన, ఆమె గర్భములో వున్న ప్రహ్లదుడు, వాటిని విని, విష్ణు భక్తునిగ మారెను.

ఆ బాలుడెప్పుడు విష్ణు నామమును జపించు చుండెను. గురువుల విద్య నేర్చుకుంటూనే, విష్ణు నామ జపాన్ని విడువలేదు, గురువులకు కూడా పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుని చదువు పరీక్షి౦చ దలచి పిలచి యడుగగా, అతను ఎలా తండ్రికి ఆత్మశుద్ది చేస్తున్నాడో వినండి.

1. మందారమకరంద మాధుర్యమున దేలు ; మధుపంబు వోవునే మదనములకు
నిర్మలమందాకినీ వీచికల దూగు ; రాయంచ చనునె తరంగిణులకు
లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు ; కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందుచంద్రికా స్ఫురిత చకోరకం ; బరుగునే సాంద్రనీహారములకు

(తేటగీతి)
అంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృత పానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు
వినుతగుణశీల మాటలు వేయునేల?

తండ్రీ! పదిమంది పరవశించి కొనియాడే గుణాలతోకూడిన శీలం ఉండవలసిన వాడవు నీవు. నీకు వెయ్యిమాటలు చెప్పటం ఎందుకు? ప్రపంచాన్ని పరీక్షించు. మనకంటె నీచస్థాయివి అనుకొనే పశువులు, పక్షులూ కూడా మహావస్తువుల రుచిమరగి నీచపదార్థాల వైపు కంటిని కూడా త్రిప్పవే. గమనించు. అదిగో తుమ్మెద. మందారపుష్పంలోని తేనె తియ్యదనంలో తేలియాడుతున్నది. ఎవరెంత ప్రయత్నించినా అది ఉమ్మెత్తలను చేరుకుంటుందా?

ఆ రాజహంసను చూడు. నిర్మలమైన గంగానది అలలలో తేలి మైమరచి ఆడుకుంటున్నది. అది సారంలేని ఏరులవైపు పయనిస్తుందా? చాలా మృదువైన తీయమామిడి చిగుళ్ళు తింటూ పరవశించిపోతున్న కోకిల కొండమల్లెలకోసం పోతుందా? పున్నమి చందురుని వెన్నెలతో పొంగిపోయే చకోరపక్షి దట్టమైన మంచుదిబ్బల వైపు వెళ్తుందా?

అలాగే అన్నిలోకాలను పుట్టించిన బ్రహ్మను పుట్టించిన బొడ్డు తామరగల శ్రీమహావిష్ణుని దివ్యమైన పాదాలనే పద్మాలను భావించటమే అమృతం. అది పుచ్చుకోవటం చేత చాలా ఎక్కువగా మదించిన నా చిత్తం మరొకదానిని ఎలా చేరగలదు?

2. చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థముఖర శాస్త్రంబులు నే
చదివినవి కలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!

నాయనా! నన్ను గురువులు చదివించారు. ధర్మము, అర్థము మొదలైన శాస్త్రాలు గట్టిగానే చదువుకున్నాను. అంతేకాదు. ఇంకానేను చదివినవి చాలా ఉన్నాయి. కానీ నిజమైన చదువు అంటే పరమాత్మ జ్ఞానమేనయ్యా! అటువంటి అనంతంగా ఉన్న చదువులలోని మర్మమంతా నేను చదువుకున్నాను.

3. తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరి న్నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమా

మహారాజా! నీవు దైత్యులలో ఉత్తముడవు. కాబట్టి ఎవడో జ్ఞానసంపన్నుడు ఉపదేశింపకపోతే నీకు తెలియదు కనుక చెప్తున్నాను. భక్తికి సంబంధించి తొమ్మిది మార్గాలు ఉన్నాయి. పట్టుదలతో తొమ్మిదింటినీ సాధించాలి. లేదా శక్తిననుసరించి కొన్నింటినైనా పట్టుకోవాలి. మానవులకు భగవంతుడు దేహాన్నీ, మనస్సునూ, మాటనూ అనుగ్రహించాడు. ఆ మూడింటినీ ఒక్కత్రాటిపైకి తెచ్చుకొని భగవంతునితో చెలిమి చేయటం మొదటిపద్ధతి. సంస్కృతంలో సఖ్యం అంటే ఒకే ప్రాణమన్నంతటి చెలిమి. భగవంతుని గూర్చి వింటూ ఉండటం రెండవ త్రోవ. భగవంతునికి దాసుడై పోవటం మూడవ దారి. నమస్కారం చేస్తూ ఉండటం నాలుగవదారి. పూజలు చేయటం అయిదవ మార్గం. స్వామికి ఏదో ఒక రూపంలో సేవచేయటం ఆరవది. ఆత్మలో భగవంతుని జ్ఞానాన్ని నిండుగా తెలిసికొని నిలుపుకొనటం ఏడవమార్గం. భగవంతునితత్త్వం తెలిపే పాటలు పాడుకుంటూ కాలం గడపటం ఎనిమిదవది. నిరంతరంగా భావిస్తూ ఉండటం తొమ్మిదవది. ఈ తొమ్మిది మార్గాలతో శ్రీహరి సర్వాత్ముడు అని నమ్మి మానవుడు సజ్జనుడై ఉండటమే భద్రమైనది అని నేను భావిస్తూ ఉంటాను. ఇది సత్యం.

4. అంధేందూదయముల్ మహాబధిరశంఖా రావముల్ మూకస
ద్గ్రంధాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ
బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ స
ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్

శ్రీహరియందు భక్తిలేనివారి బ్రతుకులు వట్టివపనికిమాలినవి. అవి ఎటువంటివంటే గ్రుడ్డివాని ఎదుట చంద్రుడు ఉదయించటం, అరచి గీపెట్టినా వినపడని చెవిటివానికి శంఖనాదం చేయటం, మూగవానిని గొప్ప వేదాంతగ్రంథాలను బోధించమనటం, పేడివానికి ఆడువారిపై కోరిక పుట్టటం, చేసినమేలు సుఖంగా మరచిపోయి ద్రోహం చేయటానికి వెనుకాడని వారితో చుట్టరికాలు చేయటం, బూడిదలో హోమద్రవ్యాలను క్రుమ్మరించటం, పిసినిగొట్టులకు సంపదలు దొరకడం, పందులకు మంచి గంధాలను అందించటం వంటివి.

5. కమలాక్షు నర్చించు కరములు కరములు ; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు ; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణునాకర్ణించు వీనులు వీనులు ; మధువైరి తవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు ; పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

(తేటగీతి)
దేవదేవుని జింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు
తండ్రి! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి

తండ్రీ! కమలాలవంటి కన్నులున్న ఆ స్వామిని పూజించే చేతులే నిజమైన చేతులు. లక్ష్మీపతి అయిన నారాయణుని గుణగణాలను కొనియాడే నాలుకయే నాలుక. దేవతలను కాపాడే ప్రభువును చూచే చూపులే చూపులు. ఆదిశేషుని పాన్పుగా చేసికొన్న వైకుంఠనాథునికి మ్రొక్కే తలయే తల. విష్ణువును గూర్చి వినే శీలం కల చెవులే చెవులు. మధువును మట్టుపెట్టిన మాధవుని అంటిపెట్టుకొని ఉండే మనస్సే మనస్సు. భగవంతునకు ప్రదక్షిణం చేసే పాదాలే పాదాలు. పురుషోత్తమునిపై నిశ్చలంగా నెలకొని ఉన్న బుద్ధియే బుద్ధి. ఆయన దేవులందరకు దేవుడు. అట్టివానిని భావించే దినమే దినము. చక్రం చేతబట్టి దుష్టసంహారం చేసే స్వామిని తెలియజెప్పే చదువే నిజమైన చదువు. ఈ సర్వభూమికీ అధినాయకుడైన మహాప్రభువును బోధించే గురువే గురువు. శ్రద్ధగా వినవయ్యా! హరిని చేరుకో నాయనా అని ఉపదేశంచేసే తండ్రియే తండ్రి.

6. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మభస్త్రిగాక
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమ ధ్వనితోడి ఢక్కగాక
హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక
కమలేశు జూడని కన్నులు కన్నులే తను కుడ్య జాల రంధ్రములుగాక

(ఆటవెలది)
చక్రిచింతలేని జన్మంబు జన్మమే
తరళ సలిల బుద్బుదంబుగాక
విష్ణుభక్తిలేని విబుధుండు విబుధుడే
పాదయుగముతోడి పశువుగాక!

రాక్షసచక్రవర్తీ! మన దేహం మాధవుని సేవకు మాత్రమే వినియోగింపబడాలి. లేకపోతే అది కాయమే కాదు. గాలితో నింపిన తోలుతిత్తి అయిపోయింది. మన నోరు వైకుంఠస్వామిని స్తుతిస్తూ ఉండాలి. లేకపోతే అది నోరేకాదు. ఢమఢమా అంటూ చప్పుడు చేసే ఢక్క అయిపోతుంది. మన చేయి శ్రీహరి పాదసేవనం చేయాలి. అప్పుడే అది హస్తం అవుతుంది. కాకపోతే చెట్టుకొమ్మతో చేసిన తెడ్డుకూ దానికీ తేడా ఉండదు. లక్ష్మీపతి అయిన శ్రీమన్నారాయణుని చూచే శీలంగల కన్నులే నిజమైన కన్నులు. ఆ పని చేయకపోతే శరీరమనే గోడలో పెట్టిన గవాక్షాలయిపోతాయి. చక్రపాణిని ధ్యానించే జన్మమే జన్మం. అది లేకపోతే క్షణంలో పగిలిపోయే నీటిబుడగ. విష్ణుభక్తిలేని పండితుడు పండితుడే కాడు. రెండు కాళ్ళున్న పశువు.

7. స‍ంసార జీమూత సంఘంబు విచ్చునే ; చక్రిదాస్యప్రభంజనము లేక
తాపత్ర యాభీల దావాగ్ను లాఱునే ; విష్ణుసేవామృత వృష్టిలేక
సర్వంకషాఘౌఘ జలరాశులింకునే ; హరిమనీషా బడబాగ్ని లేక
ఘనవిపద్గాఢాంధకారంబు లణగునే ; పద్మాక్షు నుతిరవిప్రభలు లేక

(తేటగీతి)
నిరుపమాపునరావృత్తి నిష్కళంక
ముక్తినిధి గానవచ్చునే ముఖ్యమైన
శార్ఙ్గకోదండ చింతనాంజనములేక
తామరస గర్భునకునైన దానవేంద్ర!

రాక్షసరాజా! సంసారం ఒక కారుమబ్బుల సముదాయం. అది విచ్చిపోవాలంటే శ్రీమహావిష్ణువునకు దాస్యం చేయాలి. అది ఆ మబ్బుల పాలిట పెనుగాలి. ప్రతివ్యక్తీ మూడు విధాలైన తాపాలతో- మంటలతో ఉడికిపోతూ ఉంటాడు - ఆధ్యాత్మికం, ఆదిభౌతికం, ఆధిదైవికం అని ఆ తాపాలపేర్లు. అవి దట్టంగా పెరిగిన కారడవులలో పుట్టిన దావాగ్ని వంటివి. అవి ఆరిపోవాలంటే విష్ణుసేవ అనే అమృతవర్షం కురవాలి. పాపాల ప్రోవులున్నాయే అవి అన్నింటికీ రాపిడిపెట్టే జలరాశులవంటివి. అవి ఇంకి పోవాలంటే విష్ణువునందు నెలకొన్న బుద్ధి అనే బడబాగ్ని కావాలి. చెప్పనలవికాని ఆపదలనే కాఱుచీకట్లు అణగి పోవాలంటే పద్మాలవంటి కన్నులున్న మాధవుడనే భాస్కరుని ప్రభలు ఉండాలి. మానవుడు అతిముఖ్యంగా తప్పనిసరిగా సాధించి తీరవలసిన గొప్పనిధి ఒక్కటే ఒక్కటి ఉన్నది. దానిని ముక్తి అంటారు. దానికి సాటి అయినది మరొకటిలేదు. అది సిద్ధిస్తే కలిగే గొప్ప లాభం మరల పుట్టటం గిట్టటం అనే తిరుగుళ్ళు ఉండకపోవటం. ఆ నిధిని కనుగొనాలంటే ఒక గొప్పశక్తి గల కాటుకను పెట్టుకోవాలి. ఆ కాటుక ఏమిటో తెలుసా! శార్ఙ్గం అనే వింటిని ధరించి సర్వలోకాలను రక్షిస్తున్న శ్రీహరిని నిరంతరం భావన చేయటమే. ఇది నీకూ నాకూ మాత్రమే కాదు. లోకాలన్నింటినీ సృష్టి చేస్తున్న బ్రహ్మదేవునకు కూడా అదే దిక్కు.

8. కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువున్
గానని భంగి కర్మములు గైకొని కొందఱు కర్మబద్ధులై
కానరు విష్ణుఁ గొంద ఱటఁ గందురకించన వైష్ణవాంఘ్రిసం
స్థానరజోభిషిక్తులగు సంహృతకర్ములు దానవేశ్వరా!

దానవులకు ప్రభువవైన ఓతండ్రీ! కళ్ళు లేని వాడొకడు ఏదో మేలైన వస్తువును చూడాలని మరొక గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొన్నాడు. వానికి ఆ వస్తువు కానవస్తుందా? అలాగే కొందరు యజ్ఞం మొదలైన కర్మములను పట్టుకొంటారు. అవి వారికి తెగద్రెంచు కోవటానికి వీలులేని సంకెళ్ళయిపోతాయి. దానివలన విష్ణువును చూడలేని దౌర్భాగ్యం వారిని పట్టుకొంటుంది. కానీ వివేకం పండించుకొన్న జ్ఞానులు ఉందోలేదో అన్నంత స్వల్పంగా ఉన్న శ్రీమహావిష్ణువుపాదాల మీది దుమ్ముకణంతో తలమున్కలుగా స్నానమాడి కర్మబంధాలను త్రెంపివేసుకొని విష్ణుదర్శన మహాభాగ్యం పొందుతారు.

9. బలయుతులకు దుర్బలులకు
బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకున్
బలమెవ్వడు, ప్రాణులకును
బలమెవ్వం డట్టి విభుడు బలమసురేంద్రా!

రాక్షసరాజా! నేను చాలా బలంగల వాడనని నీవు గొప్పలు చెప్పుకుంటున్నావు. కానీ వివేకంతో పరీక్షించితే సర్వలోకాలను వ్యాపించి ఉన్న ప్రభువు శ్రీమహావిష్ణువే అందరికీ, అన్నింటికీ బలం. బలం ఉన్నవాళ్ళకూ, లేనివాళ్ళకూ, నీకూ, నాకూ, బ్రహ్మ మొదలైన దేవుళ్ళకూ, ప్రాణంకల వారందరికీ బలం ఆయనే. గుర్తించినవాడు నావంటి భక్తుడు. గుర్తింపనివాడు నీవంటి రాక్షసేంద్రుడు.

10. కలడంభోధి గలండుగాలి గలడాకాశంబునన్ గుంభినిన్
కలడగ్నిన్ దిశలన్ బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
కలడోంకారమునం ద్రిమూర్తుల త్రిలింగవ్యక్తులం దంతటన్
కలడీశుండు కలండు తండ్రి వెదకంగానేల యీ యాయెడన్.

తండ్రీ! ఆ శ్రీమహావిష్ణువు సముద్రంలో ఉన్నాడు. గాలిలో ఉన్నాడు. గగనంలో ఉన్నాడు. నేలమీద ఉన్నాడు. అగ్నిలో ఉన్నాడు. అన్ని దిక్కులలో ఉన్నాడు. పగళ్ళలో, రాత్రులలో, సూర్యునిలో, చంద్రునిలో, జీవాత్మలలో, ఓంకారంలో, సృష్టి, స్థితి, లయములను చేసే బ్రహ్మవిష్ణుమహేశ్వరులలో, స్త్రీలలో, పురుషులలో, ఆరెంటికీ చెందని వ్యక్తులలో ఉన్నాడయ్యా! ఇక్కడా అక్కడా వెదకటం ఎందుకు?

11. ఇందుగల డందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
అందందే కలడు దానవాగ్రణి వింటే.

నీవు రాక్షసస్వభావం చిటారు కొమ్మమీద ఉన్నవాడవు కాబట్టి చక్రి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నావు. తండ్రీ! ఆ చక్రం చేతబట్టి నీవంటి వారి శిరస్సు ఖండించటం కోసమే ఆ శ్రీమహావిష్ణువు అవకాశంకోసం చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనే సందేహమే వలదు. ఆయన సర్వంలో, సర్వులకూ చాలా దగ్గరగా అందుబాటులోనే ఉన్నాడు. కాకపోతే నీవంటి వాడు వెదకి చూడాలి. ఎక్కడ ఎక్కడ వెదికి చూస్తే అక్కడ అక్కడనే ఉన్నాడు. ఈ మాటను చాలా జాగరూకతతో వింటున్నావా?

పట్టరాని కోపముతో, ఇందులో ఉన్నాడా నీ హరి అంటూ, హిరణ్యకశిపుడు గదతో స్థంబాన్ని మోదగా, ఆ పిల్లవాని పిలుపునకు, ఆ పిల్లవాని రక్షణకై, ఆ మహావిష్ణువు స్థంబము నుంచి దిగివచ్చారు

12. నరమూర్తిగాదు కేవల
హరిమూర్తియుఁ గాదు మానవాకారముఁ గే
సరియాకారము నున్నది
హరి మాయారచిత మగు యథార్థము సూడన్

ఇదేమిటి?! మానవాకారం అందామా? కాదే! సింహరూపం అందామా?! అదీకాదే! మానవాకారమూ, జూలు విదలిస్తున్న సింహం ఆకారమూ - రెండూ కలగాపులగంగా ఉన్నది. ఇది హరి కల్పించిన మాయ అయి ఉంటుంది. అదే సత్యం!

13. అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చి
త్తముల న్నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పా
రము ముట్ట న్నుతిసేయ నోపరఁట; నే రక్షస్తనూజుండ గ
ర్వ మదోద్రిక్తుఁడ బాలుఁడన్ జడమతిన్ వర్ణింప శక్తుండనే?

శ్రీమన్నారాయణా! నరసింహస్వామీ! దేవతలూ, సిద్ధులూ, యోగీశ్వరులూ, బ్రహ్మ మొదలైనవారు నీయందే నిలుపుకొన్న చిత్తం కలవారై ఎన్నెన్నో విధాలుగా నిరంతరమూ విచారించి ఆవలితీరం వరకూ నిన్ను నుతిచేయలేకపోతున్నారట. ఇక నేనా నీగుణాలను కొనియాడేది! అసలే రక్కసిరేని కడుపున పుట్టినవాడను, పొగరుతెగ బలిసినవాడను, జడమైన మతిగలవాడను. ఇటువంటి వానికి నిన్ను స్తోత్రం చేయడం ఎలా తెలుస్తుంది మహానుభావా!

ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా ఆదుకొని, చివరకు హిరణ్యకశిపుని సమ్హరించి, దుష్ట శిక్షణ చేశారు ఆ మహావిష్ణువు. ఆర్తరక్షణ పరాయణుడైన నరసింహ స్వామి భక్తులను మృత్యువు నుంచి కాపాడతాడు.

14. శ్రీ నరసింహ మహా మృత్యుంజయ మంత్రం
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖమ్‌
నృసింహం భీషణం భద్రం
మృత్యోర్‌ మృత్యుర్‌ నమామ్యహం

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

Prahlad teached lessons as Guru to Father Hiranyakasipu - Poems, Meaning, Punyam virtue
Narasimha avatar of Lord Vishnu, Hiranyakashipu and Prahlada  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,658; 104 తత్వాలు (Tatvaalu) and views 224,975
Dt : 23-Sep-2022, Upd Dt : 23-Sep-2022, Category : Songs
Views : 597 ( + More Social Media views ), Id : 1532 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : prahlad , teached , lessons , guru , father , hiranyakasipu , 14 , poems , punyam , virtue , vishnu , narasimha , nrusimha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content