పుత్ర బాధిత వియ్యలవారు కి, కరోనా కుమారి తండ్రి చైనా బావ తరపున, ఓ సగటు పుత్రిక తండ్రి జవాబు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2023 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2058 General Articles and views 1,786,394; 104 తత్వాలు (Tatvaalu) and views 217,094.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* 60 దోవలలో ఆఘమేఘాల మీద, మా నెట్ పెట్టె లోకి
* చిరంజీవి గారు చెప్పినా, మోహన్ బాబు గారి లాగనే
* ఆడలేక మద్దెల ఓడు
* మాయ మాటలతో, రమ్మని, తీసుకు వచ్చింది
* బస్సులో మార్కెట్లో రైలులో రిక్షాలో హోటల్లో సినిమాలు తిరిగిన సాక్ష్యాలు
* పిల్ల మేనమామ WHO, బాబాయిలు ట్రంప్ మోడీ చెప్పారు
* సర్దుకోమని అల్లాటప్పా బంధము కాదని, కేసీయార్ జగన్
3 min read time.

#సరదా పోస్ట్ హడావుడి చెయ్యకండి

ప్రియమైన, పూజ్యులైన, వియ్యాలవారికి, పిల్ల తండ్రి నమస్కరించి వ్రాయునది, ఉభయకుశలోపరి.

మీ ఉత్తరము, దేశములో ఉన్న అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా, 60 దోవలలో ఆఘమేఘాల మీద, మా చేతి నెట్ పెట్టె (సెల్ఫోన్) లోకి చేరింది. సమయానికి అవసరానికి ఒక్క మంచి మెస్సేజ్ కూడా రాదు కాని, ఇది మాత్రము అనేక మంది నుంచి, అనేక దోవలలో వచ్చింది.

ఇంటి తప్పు చెవిలో చెప్పమని చిరంజీవి గారు చెప్పినా, మీరు గమ్మత్తు గా మోహన్ బాబు గారి లాగనే, ఊరంతా తెలిసేలా చేసారు. కానీ, మీరు రాసిన విధానము నచ్చింది, కాకపోతే ఇంట్లో వాళ్ళను అనలేక, అదుపులో పెట్టుకోలేక, ఊళ్ళో వాళ్ళ మీద ఉరిమి పడ్డట్లు గా ఉంది.

మీ అబ్బాయి తొందరపాటు తనానికి, మీరు ఇప్పుడు ఇలా చింతించడము ఆరోపించడము, ఏమీ బాగోలేదు. ఆడలేక మద్దెల ఓడు, అన్న సామెత లాగా ఉంది, మీ ఉత్తరము. కొడుకుని అదుపులో ఉంచలేక సంస్కారము నేర్పనందుకు, మీ ఇన్నేళ్ళ పెంపకానికి ఏడ్వలేక, మమ్మల్ని నిందించడము బాగోలేదు.

చక్కగా ఎక్కడో చైనా లో, ఒక మూల గ్రామ ప్రాంతములో, చదువుకుని పరీక్షలలో పాల్గొంటున్న, మా టెస్ట్ ట్యుబ్ పిల్ల సిగ్గుల మొగ్గ కరోనా కుమారి, తనంతట తానూ ఎవరివైపూ చూడదు, మాట్లాడదు, ఎవరింటికి పోదు, గమ్మున తనపని ఏమిటో తాను చేసుకునేది.

అలాంటిది, మీ దేశములో డాక్టర్ చదవడానికి, సీటు రాక, దూర ప్రాంతమైన చైనా వచ్చి చదువుకుంటూ, మీ ఊళ్ళో ఆడపిల్లలు దొరకరని, మాయ మాటలతో మా పిల్లను బుట్టలో వేసుకుని, రమ్మని బతిమిలాడి చేయిపట్టుకుని, మాకు దూరము చేసి, తీసుకు వచ్చింది ఎవరు? దానికి ప్రొత్సహము ఇచ్చింది ఎవరు?

దగ్గర సంబంధాలు చేసుకోండి అని మీ పెద్దలు చెపితే, ధనము ఆస్తుల అందము విదేశం మెట్రోనగరం మీద వ్యామోహముతో, ఇలా చేయడము తగునా? పెద్దలు మీరే చెప్పండి. వీపు మీద చెయ్యి వెసుకుని, కళ్ళు రెండు మూసుకుని, మా అల్లుడిని చెప్పమనండి?

ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ వీడియో లు, చూసిన మనుషులు, ఫోటోలు సాక్ష్యాలు ఉన్నాయి సుమా, మరువద్దు మాట మార్చొద్దు. బస్సులో మార్కెట్లో రైలులో రిక్షాలో హోటల్లో సినిమాలు తిరిగినవి దొంగచాటుగా, పెద్దలు వద్దు అంటున్నా.

మా కరోనా బంగారం పై ఆశపడి, మీరు కావాలని తీసుకెళ్ళి, మమ్మల్ని ఆడిపోసుకోవడము బాగోలేదు. మా అమ్మాయి ఎన్ని మంచి పనులు చేసి పెట్టి, ఎంత సంప్రదాయముగా మిమ్మల్ని కాపాడింది, ఆలోచన చెయ్యండి.

ఎన్నడైనా, మీ ముద్దుల కొడుకు లేదా ఇంట్లో వాళ్ళు, ఓ నెలరోజులు అందరికి దగ్గరాగా కుదురుగా ఇంట్లో పిల్లా పాపలతో పెద్దలతో గడిపారా? మరి మా పిల్ల కరోనా, ఆ భాగ్యము ఇప్పుడు ప్రసాదించింది, అది తప్పా? గాలికి సందుల్లో చిందులు వేసే, మీ పిల్లలను , ఇంటిపట్టున పెట్టింది.

తల్లి దండ్రులుగా, మాస్టారులా మీరు చేయలేనిది, తను సాధించింది, muaDu nelalaloa. పొగడ్తలు లేకపోయినా పర్లేదు, కానీ తెగడ్తలైతే, ఎలా బావ గారు?

మూడు నెలలుగా పోలీసులు, ప్రభుత్వము ఎంత మొత్తుకున్నా, మీ లేదా చుట్టాల పిల్లలు వింటున్నారా? ఎగబడి, మావూరు పిల్లలను చేత బట్టుకుని, ఇంటికి పోతూ, 14 రోజులు క్వారంటైన్ కి పోతున్నారు. అజాగ్రత్త, నిర్లక్ష్యము మీది, మీ చుట్టాలది కాదా? అని సవినయముగా ప్రశ్నించే ధైర్యము చేస్తున్నాను.

భార్యని దేవతలా చూసుకోమని మీ శాస్త్రాలు చెపుతుంటే, ఇన్ని మంచి పనులు చేసిన మా పిచ్చి తల్లిని, కొట్టడానికి చెయ్యి ఎత్తడానికి మనసెలా వచ్చింది, పైగా ముళ్ళు గుచ్చుకునే పనులు చేసే, మీ మొహాంధకార సుందర పుత్రుడికి? అందుకే, ప్రభుత్వము క్వారంటైన్ భయము తో , మా పిల్లకు రక్షణకు ఇచ్చింది, మీ కుటుంబం నుంచి కాపాడాలని.

గతములో పిల్లాడు బడికి వెళుతుంటే, బాధతో తల్లి అల్లాడేది, ఎత్తి ఆటో బస్సులో పడేసేది కుదేసేది. ఇప్పుడు, ఇంటిపట్టునే ఉండి, స్కూల్ ఫీజ్ లు, ప్రయాణ ఖర్చులు తగ్గించి, భర్త భార్య పిల్లల కోసం ఎదురు చూపులు లేకుండా చేసింది, అదీ తప్పేనా?

పిల్లల గోల ను తప్పించుకోవడానికి, టీవీలు సెల్ఫోన్ ఆన్లైన్ గేములు అలవాటు చేసింది మీరు, ఇప్పుడు వాటితోనే ఇంట్లో ఆన్లైన్లో ఫోన్లో లాప్ టాప్ లో చూస్తూ చదువుకోమనడము తప్పా? అధ్యక్షా? మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పు నా?

క్వారంటైన్ లో పరిస్తితి తిండి బాగోలేదని మిగతా వారు ఏడుస్తుంటే, మీకు ఆ పరిస్తితి రాకూడదని, ముందు జాగ్రత్త తో మాస్కులు పెట్టుకోమని చెప్పింది తప్పా. హెల్మెట్ లేకుండా బండి నడిపి, ప్రాణాలు పోయాక ప్రభుత్వము ను తప్పుబట్టడం, ఇదే గా మీ సామాజిక న్యాయము బావ గారు.

మా అమ్మాయి వచ్చాక, పండగ ఖర్చు తగ్గింది, రోగాల ఖర్చు తగ్గింది, ఉత్తుత్తి బంధువుల రాక తగ్గింది, అనవసరపు ఖర్చులు ప్రయాణాలు మాటలు ప్రమాదాలు గొడవలు తగ్గాయి, సినిమలు షికార్లు షాపింగులు తగ్గించింది, అంటే ఉత్తమ ఇల్లాలు, అనడానికి నోరు రాదా? అసలు బయటకు వద్దు, ఎండ ల లో అంటే, మస్క్ గ్లౌజ్ తొడుగులతో మగ్గుతున్నాము అంటే, ఎలా బావా గారు.

ఇంత మంచి చేసినా, మీ అబ్బాయి మరియు మీరు మారారా? లేదు కదా, పొగడాల్సింది పోయి, నలుగురు ఎదురు మమ్మల్ని ఎత్తిపొడుస్తున్నారు, చమత్కారాలతో.

మొదటినుండి, మీ సంబంధం మేము కోరలేదు, మీరు వెంటపడ్డారు. పిల్ల మేనమామ లాంటి WHO గారు చెప్పారు వద్దని. బాబాయిలు లాంటి ట్రంప్ మరియు మోడీ గారు కూడా చెప్పారు, జాగ్రత్త గా ఉండమని, మీ పుత్రులు ఉండటము లేదు.

ఇక అసలు విషయము ఏమిటి అంటే, ఒక సారి పెళ్ళి అయినాక, సాంప్రదాయ బద్దముగా, కలసి మెలసి ఉండాలి. ఇలా ఇంటర్నెట్ లోకి టీవీలోకి పేపర్లో కి ఎక్కకుండా. మీ అబ్బాయిని దిగులు వదిలి, ప్రశాంతముగా ఉండమని, అన్ని జాగ్రత్తలతో ముందుకు సాగాలని, సర్దుకోమని, కలసి కాపురము చేయాలని, ఇది ఇప్పుడల్లా వీడే అల్లాటప్పా బంధము కాదని, మన శ్రేయోభిలాషులు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీయార్ మరియు జగన్ గారులు ఎప్పుడో చెప్పారు.

ఎటూ మన సాంప్రదాయాలు చాలా వరకు గాలికి వదిలి మంటగలిపారు కాబట్టి, ఆషాఢం వచ్చినా సునామీ వచ్చినా, ఇప్పుడు రైళ్ళు బస్సులు విమానాలు లేవు కాబట్టి, ఉన్నా మన డబ్బునే వదిలించి 14 రోజులు క్వారంటైన్ చేస్తారు కాబట్టి, మనకు లేని రోగము కూడా వచ్చి అంటుకుంటుంది కాబట్టి, అన్ని మూసుకుని, అందరికి 6 అడుగుల దూరంలో ఉండి, మాస్క్ గ్లౌజ్ వాడుతూ, ఇంటి తిండితో, ఇంట్లో కూర్చుని ఆరోగ్యముగా, కలసి మెలసి ఉంటారని సవినయముగా భావిస్తూ,

మంచి జరిగితే అబ్బాయిని, చెడు జరిగితే అమ్మాయిని తిట్టే, పాడు బుద్ది మీకు పోతుంది అని ఆశిస్తూ,

నిప్పు కణికని ముద్ద మందారమని, ఏరి కోరి తెచ్చుకుని, మూర్ఖముగా ఇల్లు తగలబెట్టుకుని, నిప్పుది తప్పు అనరని, తప్పు గా వాడిన మూర్ఖుడు ది తప్పు అని, అర్ధము చేసుకుంటారు అని భావిస్తూ,

ఇంతే సంగతులు!!

ఇట్లు ,
మీ పుత్ర బాధిత, ఉత్తమ కరోనా కుమారి జనకులు

----------------------------అసలు ఉత్తరము---------------------

అప్రియాతి అప్రియమైన, అపూజ్యనీయులైన చైనా బావగారికి,

మీ వియ్యంకుడు ఛీత్కరించుకుంటూ... వ్రాయునది.

కుశలమూ, కాకరకాయా ఏమీ లేవు. మీ దరిద్రాన్ని మాకంటగట్టాక మీరు క్షేమంగానే ఉండి ఉంటారు. మా బతుకే మీ వూహాన్ మార్కెట్లా ఛండాలంగా తయారయ్యింది.

ఏనాడైతే మీ అమ్మాయి కరోనా కుమారి, మా ఇంట్లో కుడి కాలెట్టి ప్రవేశించిందో కానీ, ఇల్లంతా అల్లకల్లోలం చేసేసి, అన్నిటికీ తాళాలేసి పడేసింది మహాతల్లి.
సామాజిక న్యాయం కోసం, ఎల్లప్పుడూ సమసమాజం సందుల్లో సరదాగా తిరిగే మమ్మల్ని, సామాజిక దూరం, సింగినాదం అని మూకుమ్మడిగా మూటగట్టి, ఇంట్లో కూర్చోబెట్టింది మీ ముద్దుల కూతురు!

మూడు నెలలుగా ఇంట్లోనే ఉండీ, తోచీ తోచక మొగుడూ పెళ్ళాలు తిట్టుకునీ, కొట్టుకునీ, థప్పడ్లూ...., తాటాకులూ... అంటున్నారు.
స్కూళ్ళు లేక ఇంట్లోనే ఉంటున్న పిల్లకాయలు అల్లర్లూ, ఆన్లైన్ క్లాసులతో మా బుర్రల్ని మీరు బొద్దింకల్ని తిన్నట్టు తినేస్తున్నారు.

ఈ ఘోరాలన్నింటికీ కారణమైన మీ అమ్మాయి మీద ఒళ్ళు మండి, లాగి పెట్టి ఒక్కటి కొట్టాలని ఉన్నప్పటికీ, ఆ ముళ్ళసుందరిని మేము తాకినా, ఆమె మమ్మల్ని తాకినా క్వారంటైన్ అయ్యేది, మా బ్రతుకేనని గ్రహించి ఆ ప్రయత్నం విరమించుకున్నాము. అసలు ఆమెని తాకడమనే వెర్రి ఆలోచనకే భయంతో వణుకుతూ చేతులు శానిటైజర్లతో రుద్దీ రుద్దీ, పాలకోవా మందంలో ఉండే మా చేతులు, పూతరేకుల మందానికి అరిగిపోయాయి.

ఈ తాకడాలు, తలనొప్పులూ ఎందుకులే గాని, పోనీ దూరంనుండైనా నోరారా తిట్టి మా నోటిపూత తీర్చుకుందామంటే, మా మూతులకి మాస్కులు తగిలించేసింది ముష్టి మొహంది. ఏ మాటకామాట, అసలు మీ అమ్మాయి అందమే అందం! నట్టింట్లో నెత్తి మీద కిరీటం పెట్టుకు తిరుగుతుంది.... వెధవ చీకేసిన తాట్టెంక మొహమూ అదీనూ..!

ఆవిడ గారు అడుగెట్టాక,
ఓ పండుగా లేదు, పబ్బమూ లేదు.
ఓ మాటా లేదు, మంచీ లేదు.
ఓ సినిమా లేదు, షాపింగ్ లేదు.
ఐసోలేషన్లూ, క్వారంటైన్లూ తప్ప...!

వెళ్లక వెళ్లక బయటకెళ్లినా, ఈ వేసవిలో ఆ పీపీయీ (PPE) కిట్లు, మాస్కులూ వేసుకుంటుంటే కావేసిన మామిడి పళ్ళల్లా మగ్గి చస్తున్నాం, మా ముక్కూ మొహం మండా!

పొరపాటున బయట చీదినా, తుమ్మినా పక్కనోళ్లు చూసే అనుమానపు చూపుల ఆపరేషన్లని తట్టుకునే కంటే, కూసింత కోపరేషన్తో ఇంట్లో కూర్చోవడం మంచిదని భావించి గుట్టుగా బతుకుతున్నాం, వెధవ సంతాని... వెధవ సంత!

అంతకీ నయానో, భయానో బెదిరిద్దామని పళ్ళాలూ గట్రా కొట్టి, దీపాలవీ పెట్టి చూసాము కూడా... అబ్బే, మొండి ఘటం కదూ... లొంగి చావలేదు! పోనీ మొన్నేదో యుగాంతం అన్నారు కదా, పనిలో పనిగా మీ కరోనా కుమారి కూడా అంతమైపోద్దేమోనని అతిగా ఆశపడ్డాము మరియు ఆవేశపడ్డాము కూడా, అబ్బే ఆ ముచ్చటా తీరలేదు... మాకంత అదృష్టం ఎక్కడిదీ...?

చివరికి ఏవో మాకు తోచిన, ఆత్మనిర్భరాలవీ, ప్రకటించుకుని కాస్త ధైర్యం చెప్పుకుందామనుకున్నాం గానీ, ఇక నిబ్బరంగా ఉండడం మా వల్ల కాదు బాబూ...!!!

అయినా మొదటి నుండీ మీతో సంబంధం కలుపుకోవడం మాకిష్టం లేదు. అయినప్పటికీ పిల్ల మేనమామ అయినటువంటి, ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గారు చెప్పిన కల్లబొల్లి కబుర్లు నమ్మి, నిండా మునిగి, ఇప్పుడు భయంతో వణికి చస్తున్నాం.

ఇక అసలు చెప్పదలచుకున్నదేమనగా, మరి మీ గారాల కూతురు తన పుట్టింటిని, మరీ ముఖ్యంగా తన తల్లిగారైన గబ్బిలాన్ని గుర్తు తెచ్చుకుని, గంపెడు గుబులు పడుతుంది..... బెంగతో దిగులు చెందుతుంది.

ఎలాగూ ఆషాడం కూడా వచ్చింది కనుక శాస్త్రం ప్రకారం మీ కరోనా కుమారిని పుట్టింటికి తీసుకెళ్లి, అమ్మాయి బెంగ తీర్చవలసిందని వేడుకుంటున్నాము.
ఆషాడం తర్వాత మీ పుత్రిక మళ్ళీ మా గడప తొక్కకుండా, ఆలోగా మేము కూడా మీలాగా ఒక గోడ కట్టుకుని, మా పాట్లేవో మేము పడతాము.
ఇంతే సంగతులు!!

ఇట్లు ,
మీ కరోనా కుమారి బాధిత వియ్యలవారు ..!  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2058 General Articles and views 1,786,394; 104 తత్వాలు (Tatvaalu) and views 217,094
Dt : 26-Jun-2020, Upd Dt : 26-Jun-2020, Category : General
Views : 963 ( + More Social Media views ), Id : 585 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : son stroke , father in law , corona kumari , china bava , daughter father
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content